కాల్పుల కలకలం.. అమెరికాలో ఆంధ్రా యువకుడి మృతి

వాస్తవం సినిమా: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్ధరిల్లింది. ఓహియో రాష్ట్రంలోని సిన్సినాటీ నగరంలో ఉన్న ఫిఫ్త్ థర్డ్ సెంటర్ లో ప్రవేశించిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ తెలుగు యువకుడు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ అధికారులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.

ఫౌంటైన్ స్వ్కేర్ లోని ఫిఫ్త్ థర్డ్ సెంటర్ భవనం లాబీలో జరిగిన ఈ కాల్పుల్లో గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట వాసి కందేపి పృథ్వీరాజ్(26) ప్రాణాలు కోల్పోయాడు. ఈ కాల్పులు జరిపిన వ్యక్తిని ఒమర్ ఎన్రిక్ శాంటా(29)గా అధికారులు గుర్తించారు. ఇతని వద్ద 200 రౌండ్లకు సరిపడా బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుమారుడి మరణవార్త తెలిసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పృథ్విరాజ్ మృతదేహాన్ని గుంటూరుకు తరలించేందుకు అమెరికా ప్రతినిధులతో పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధులను సంప్రదిస్తున్నారు.