పాక్ నూతన అధ్యక్షుడి పూర్వీకులు భారత్ కు చెందిన వారే!

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్ కొత్త అధ్యక్షుడుగా డాక్టర్ ఆరిఫ్ అల్వీ ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఆయన భారత మూలాలకు చెందినవారే అన్నట్లు తెలుస్తుంది. ఆయన పూర్వీకులు భారత్‌కు చెందినవారేనని వెల్లడైంది. భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వద్ద ఆరిఫ్ అల్వీ తండ్రి దంత వైద్యునిగా పనిచేసినట్టు పాక్ అధికార పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) తెలిపింది. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఆరిఫ్ అల్వీ పాకిస్థాన్ అధ్యక్షునిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. భారత మూలాలతో పాక్ అధ్యక్షునిగా ఎన్నికైన వారిలో ఆరిఫ్ అల్వీ మూడో వ్యక్తి. వీరి కుటుంబాలు దేశ విభజన సందర్భంగా భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. ఆరిఫ్ అల్వీకి ముందున్న అధ్యక్షులు మామ్నూన్ హుస్సేన్ కుటుంబం ఆగ్రాకు చెందినది కాగా, పర్వేజ్ ముషారఫ్ తల్లిదండ్రులు ఢిల్లీ నుంచి వలస వెళ్ళిన సంగతి తెలిసిందే.