మూడేళ్లు గా సాగుతున్న గుట్కా స్కాం…..రూ.40 కోట్ల ముడుపులు అందుకున్న మంత్రి!

వాస్తవం ప్రతినిధి: తమిళనాడులో గత మూడేళ్లుగా రహస్యంగా సాగుతున్న గుట్కా అక్రమ అమ్మకాలపై సీబీఐ పంజా విసిరింది. గుట్కా తయారీదారుల నుంచి దాదాపు రూ.40 కోట్ల ముడుపులు పుచ్చుకున్నారని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ పై అలానే డీజీపీ టీకే రాజేంద్రన్,చెన్నై నగర మాజీ పోలీస్ కమీషనర్ జార్జ్ లపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో వారి ఇళ్ళ పై ఏకకాలం లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. తమిళనాడులో మొత్తం 40 చోట్ల, బెంగళూరు, ముంబైలో రెండు చోట్ల దాడులు జరిగినట్లు తెలిసింది. రూ.250 కోట్ల ఆదాయ పన్నును ఎగవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ గుట్కా వ్యాపారి గిడ్డంగులపై అధికారులు సోదాలు నిర్వహించడంతో గతేడాది జూలై 8న ఈ స్కాం వెలుగుచూసింది. ఆదాయ పన్ను ఎగవేత ఆరోపణలపై విజయభాస్కర్‌ నివాసంలో గతంలో ఐటీ అధికారులు కూడా సోదాలు జరిపారు. పదవిలో ఉండగా సీబీఐ దాడులు ఎదుర్కొన్న తొలి డీజీపీ రాజేంద్రనే కావడం గమనార్హం.