రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందం పై స్టే కోసం సుప్రీం లో పిటీషన్!

వాస్తవం ప్రతినిధి: రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు పై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు విషయంలో ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై స్టే విధించాలని ఇటీవల అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు అయ్యింది. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వచ్చే వారం ఈ పిటిషన్‌ను విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ప్రకటించింది. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న న్యాయవాది ఎంఎల్‌ శర్మ విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుని విచారణకు అంగీకరించింది. రాఫెల్‌ ఒప్పందంలో పలు లొసుగులు ఉన్నాయని, దాని అమలుపై స్టే విధించాలని శర్మ కోర్టును కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్, వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ, ఫ్రెంచ్‌ రక్షణ సంస్థ డసాల్ట్‌లపై కేసులు నమోదుచేసి విచారించాలని కోరారు.