ఎమ్మెల్యే పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా

వాస్తవం ప్రతినిధి:   ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలూ వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. మరికాసేపట్లో ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రద్దు చేయబోతున్నారనగా..తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయంలో తన రాజీనామా లేఖను అందజేశారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ ఉంది. స్పీకర్ ను కలిసేందుకు రేవంత్ ప్రయత్నించారు. కానీ, అందుకు, స్పీకర్ అంగీకరించకపోవడంతో తన లేఖను సంబంధిత కార్యాలయంలో అందజేశారు. కాగా, కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ ముందస్తుకు పోతారంటే ఇప్పటికి నమ్మనని అన్నారు. కేసీఆర్ పిచ్చి వ్యవహారానికి నిరసనగా రాజీనామా చేస్తున్నానని చెప్పారు. కేసీఆర్‌ జాతకం బాగోలేకపోతే ప్రజల జాతకాలను మార్చడమెందుకని రేవంత్‌ ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్‌ ఇస్తున్న ప్రాధాన్యత.. పాలన మీద పెడితే మంచిదని సూచించారు.