ఆఫ్రికాలో దారుణం..వంద ఏనుగులు ఊచకోత

వాస్తవం ప్రతినిధి: ఆఫ్రికాలో దారుణం చోటుచేసుకుంది. ఏకంగా వంద ఏనుగులు ఊచకోతకు గురయ్యాయి. ఆఫ్రికాలో ని బోట్వానా లోని అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు ఆకాశమార్గాన జరిపిన సర్వేలో ఏనుగుల కళేబరాలు అడవిలో అక్కడక్కడా చెల్లాచెదురుగా పడి ఉండడం కనిపించింది. దీంతో అటవీ అధికారులు రంగంలోకి దిగడంతో సుమారు వంద ఏనుగులు విగతజీవులై కనిపించాయి. ఏనుగు దంతాలను తస్కరించేందుకే ముష్కరులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. జూలై 10వ తేదీ నుంచి ఈ ఊచకోత చోటుచేసుకున్నట్లు గుర్తించారు. ప్రతిరోజూ ఇంకా కళేబరాలు కనిపిసూనే ఉన్నాయి అని వన్యప్రాణి సంరక్షణ సంస్థ ఎలిఫెంట్స్ వితౌట్ బార్డర్స్ డైరెక్టర్ మైక్ చేజ్ తెలిపారు. ఇప్పటిదాకా ఆఫ్రికాలో ఇంతఘోరం జరగలేదని ఆయన వాపోయారు. ఫారెస్టు రేంజర్ల నుంచి ఆయుధాలు ఉపసంహరించిన తర్వాత ఊచకోత చోటుచేసుకున్నదని ఆయన వివరించారు.