ప్రధాని పై మండిపడుతున్న ప్రజలు

వాస్తవం ప్రతినిధి: దేశాధినేత హోదాలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళగా రికార్డుకెక్కిన న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డర్న్ ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. ‘బ్రెస్ట్‌ఫీడింగ్‌ పేరు చెప్పి ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తున్నారంటూ’ ఆమెపై న్యూజిలాండ్‌ పౌరులు సోషల్ మీడియా లో మండిపడుతున్నారు. విషయమేంటంటే.. రెండు నెలల క్రితం ఆర్డర్న్‌ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె కూడా అందరిలానే సాధరణ మహిళ అయితే మెటర‍్నటి లీవ్‌ పెట్టి ఇంటి వద్దనే ఉంటూ తన చిన్నారి ఆలన పాలన చూసుకునేవారేమో. కానీ దేశాధ్యక్షురాలు కావడంతో కేవలం రెండు నెలలు మాత్రమే మెటర్నటి సెలవులు తీసుకుని, అనంతరం తన చిన్నారితో కలిసి విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 1 – 9 వరకూ నౌరులో జరగనున్న ‘పసిఫిక్‌ ఐస్‌ల్యాండ్స్‌ సమ్మిట్‌’కి ఆర్డర్న్‌ తన చిన్నారితో కలిసి హాజరయ్యారు. అయితే ఈ సమ్మిట్‌కి ఆర్డర్న్‌తో పాటు ఉప ప్రధాని విన్‌స్టన్‌ పీటర్స్‌ కూడా హాజరయ్యారు. ఒకే కార్యక్రమానికి హాజరవుతోన్న ప్రధాని, ఉప ప్రధాని మాత్రం రెండు వేర్వేరు విమానాల్లో ప్రయాణించారు. ప్రయాణంలో తన బిడ్డకు పాలివ్వడానికి వీలుగా ఉంటుందని భావించి ఆర్డర్న్‌ ఇలా చేశారు. సమావేశానికి హాజరయ్యే సమయంలో ఆర్డర్న్‌ తన బిడ్డకు పాలు ఇస్తూ ఉండి పోవడం వల్ల.. పీటర్స్‌ అక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకే సమావేశానికి హాజరవ్వడం కోసం ప్రధాని, ఉప ప్రధాని ఇలా రెండు వేర్వేరు విమానాల్లో ప్రయాణించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై 50,000(మన కరెన్సీలో దాదాపు 35 లక్షల రూపాయలు) డాలర్లు అదనపు భారం పడిందని హెరాల్డ్‌ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీనితో న్యూజిలాండ్ ప్రజలు స్పందిస్తూ.. ‘ఇంత డబ్బు ఖర్చు చేసి మీరు ఆ కార్యక్రమానికి హాజరవ్వడం అంత అవసరమా.. ఒక వేళ మీ డిప్యూటీ వెళ్తే సరిపోయేది అనుకుంటే అతన్నే పంపిస్తే అయిపోయేదిగా’ అంటూ ఆర్డర్న్‌ని విమర్శిస్తున్నారు. కానీ ఆమెకు మద్దతు తెలిపే వారు మాత్రం.. ‘ఆర్డర్న్‌ తల్లిగా, దేశాధ్యక్షురాలిగా రెండు బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించించార’ని మెచ్చుకుంటున్నారు. మరోపక్క ఆమె మాత్రం నేను ఈ కార్యక్రమానికి హాజరుకాకపోయినా విమర్శించేవారు ఇలాంటి వాటిని పట్టించుకుంటే ముందుకు సాగాలేము అంటూ కొట్టి పారేస్తున్నారు.