ముఖేష్ గౌడ్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ

వాస్తవం ప్రతినిధి: ఓవైపు ముందస్తు ఎన్నికలు ఖాయంగా కనిపిస్తుండడం… అసెంబ్లీని రద్దు చేసేందుకు కూడా సీఎం కేసీఆర్‌ సిద్ధమవుతుండడంతో… మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ముందస్తుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా నేడు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ నివాసంలో సమావేశం కానున్న టి.కాంగ్రెస్ నేతలు… అసెంబ్లీనీ రద్దు చేస్తే అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భేటీకి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో పాటు భట్టి విక్రమార్క, డీకే అరుణ, దామోదర్ రాజనర్సింహా, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ తదితరలు హాజరుకానున్నారు.