గడ్డం పెంచిన ప్రతివాడూ గబ్బర్ సింగ్ కాలేడు: కెటిఆర్

వాస్తవం ప్రతినిధి: టిఆర్‌ఎస్ సృష్టించే ఓట్ల సునామీలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు మంత్రి కెటిఆర్. ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మంత్రి కెటిఆర్ సమక్షంలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపిపి ఎల్. నర్సింగ్‌రావుతో పాటు పెద్దఎత్తున ఆ పార్టీ నేతలు టిఆర్‌ఎస్‌లో చేరారు. నాగర్‌కర్నూల్ శాసనసభ్యుడు మర్రి జనార్దన్‌రెడ్డి రూపొందించిన ఎన్నికల ప్రచార రథంపై నుంచి మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని, విపక్షాలకు డిపాజిట్లు కూడా రాలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ను జనాలు తిరస్కరిస్తున్నా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి భయపడే పరిస్థితి దేశంలో ఉందా? అని ప్రశ్నించారు. ఎస్పీ నేత అఖిలేష్ సింగ్ యాదవ్ మద్దతు లేనిదే అమేథీలో రాహుల్ గాంధీ గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. రాహుల్ వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపిస్తారంటే నమ్మేదెవరని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోందని అన్నారు.

కేసీఆర్ ను ఓడించేంత వరకు గడ్డం తీయనని అంటున్నారని… గడ్డం పెంచిన ప్రతివాడూ గబ్బర్ సింగ్ కాలేరని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో 12 మంది ముఖ్యమంత్రుల అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 43 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. 24 గంటల పాటు రైతులకు కరెంట్ ను అందిస్తున్నామని చెప్పారు. ప్రగతి నివేదన సభపై విపక్షాలు చేస్తున్న విమర్శలు పసలేనివని అన్నారు. ప్రగతి నివేదన సభలో దద్దమ్మలు, సన్నాసులు అని సిఎం కెసిఆర్ తిట్టనందుకు కాంగ్రెస్ నేతలు తెగ బాధ పడిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రగతి నివేదన సభ లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ళలో సాధించిన విజయాలనే కెసిఆర్ ప్రజలకు వివరించారన్నారు. అలాంటి సభపై చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా కాంగ్రెస్ నేతలు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని కెటిఆర్ విమర్శించారు.