ఒలింపిక్స్ లో భారత్ కు రెండు కోటాలు ఖరారు

వాస్తవం ప్రతినిధి: జపాన్‌లో 2020లో జరిగే ఒలింపిక్స్‌లో భారత్‌కు అప్పుడే రెండు కోటాలు ఖరారయ్యాయి. భారత షూటర్లు అంజుమ్‌ మౌడ్గిల్‌, అపూర్వీ చందేలా ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రెండు, నాలుగు స్థానాల్లో నిలవడం తో ఒలింపిక్స్ కు అర్హత సాదించారు. అంజుమ్‌ ఈ పోటీలో 248.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకుంది. కొరియా షూటర్లు హానా ఇమ్‌ (251.1), జంగ్‌ (228.0) స్వర్ణ, కాంస్య పతకాలు అందుకున్నారు. అపూర్వీ చందేలా 207 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈవెంట్‌లో ఒక దేశానికి రెండు కోటాలు లభిస్తున్న నేపథ్యంలో అపూర్వీకి కూడా అవకాశం దక్కింది. ఒలింపిక్స్‌ బెర్తులను అందించే తొలి పోటీ ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ టోర్నీనే కావడం గమనార్హం. మొత్తం 15 విభాగాల్లో 60 కోటాలు అందిస్తుంది. అయితే భారత్‌కు కోటాలు తీసుకొచ్చింది అంజుమ్‌, అపూర్వీ అయినా ఒలింపిక్స్‌ ముందు నిర్వహించే ట్రయల్స్‌లో ఏ క్రీడాకారుడు మెరుగైన ప్రదర్శన చేస్తారో వారికే అవకాశం ఇస్తారు.