దుర్గమ్మ కరుణతో ధర్మం గెలిచింది: స్వామి పరిపూర్ణానంద

వాస్తవం ప్రతినిధి: హైదరాబాద్ పోలీసులు తనను నగరం నుంచి బహిష్కరిస్తే, కోర్టులో పోరాడి ఊరట పొందిన శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద, గత రాత్రి కాకినాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యంలో ఈ ఉదయం ఆయన విజయవాడలో ఆగి కనకదుర్గమ్మను దర్శించుకొన్నారు. ఆలయానికి చేరుకున్న పరిపూర్ణానంద స్వామికి అధికారులు, అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికారు. అమ్మ సన్నిధిలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం తన జీవితాన్ని అంకితం చేశానని, అందుకోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమని అన్నారు. హైదరాబాద్ పోలీసులు తనను నగరం నుంచి బహిష్కరించినా దుర్గమ్మ కరుణతో న్యాయస్థానంలో ధర్మం గెలిచిందని స్వామి పరిపూర్ణానంద అన్నారు.
హైదరాబాద్‌ పరిధిలోని ఉప్పల్‌ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ దగ్గరుండి ఆయన్ను హైదరాబాద్ తీసుకుని వస్తున్నారు. ఈ మధ్యాహ్నం తరువాత ఆయన హైదరాబాద్ చేరనుండగా, శివార్ల నుంచి భారీ ఊరేగింపుతో ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ, వీహెచ్పీ నేతలు ఏర్పాట్లు చేశారు.