నాలుగో టెస్ట్ లో ఓటమి పాలైన టీమిండియా…సిరీస్ చేజార్చుకుంది

వాస్తవం ప్రతినిధి: నాలుగో టెస్టులో భారత్‌కు చుక్కెదురైంది. రెండు వరుస ఓటముల అనంతరం మూడో టెస్టులో అద్భుత విజయం సాధించిన భారత్‌ నాలుగో టెస్ట్ లో మళ్లీ చతికిల పడింది. సౌతాంప్టన్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో 5 టెస్టుల సిరీస్‌ను 3-1 తేడాతో ఇంగ్లాండ్‌ కైవసం చేసుకున్నట్లు అయ్యింది. నాలుగో టెస్టులో 245 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ 184 పరుగులకే ఆలౌట్ అవ్వడం తో ఇంగ్లాండ్ జట్టు సిరీస్ ని కైవసం చేసుకుంది. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 22 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోవడం తో పెద్ద దెబ్బ పడింది. ఓపెనర్‌ కే ఎల్‌ రాహుల్‌ (0) పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. స్వల్ప వ్యవధిలోనే తొలి డౌన్‌లో వచ్చిన పుజారా (5) ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. అప్పటికి జట్టు స్కోరు 17. క్రీజులో నిలదొక్కుకుంటున్న సమయంలో మరో ఓపెనర్‌ ధావన్‌ (17) అండర్సన్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సారథి కోహ్లీ (58) రహానే (51) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నిలకడగా ఆడుతున్న ఈ జోడీని మొయీన్‌ విడగొట్టాడు. జట్టు స్కోరు 123 వద్ద కోహ్లీ ఔటయ్యాడు. మరో 4 పరుగుల వ్యవధిలోనే పాండ్యా (0) డకౌటయ్యాడు. రిషబ్‌ పంత్‌ (18), ఇషాంత్‌ శర్మ(0), షమి(8), రవిచంద్రన్‌ అశ్విన్‌ (25) పరుగులు చేశారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో మొయీన్‌ అలీ 4, అండర్సన్‌, స్టోక్స్‌ చెరో 2, బ్రాడ్‌, కరన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.