అట్టహాసంగా ముగిసిన ఆసియా క్రీడలు

వాస్తవం ప్రతినిధి: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు ముగిశాయి. గత 15 రోజుల పాటు అభిమానులను అలరించిన ఆసియా క్రీడలను అట్టహాసంగా ముగించారు. జకార్తాలోని గెలొరా బంగ్‌ కర్నో స్టేడియంలో రెండు గంటల పాటు సాగిన ఈ ముగింపు వేడక అందర్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇక వీడ్కోలు అంటూ ఇండోనేషియా సెలవు తీసుకోగా.. 2022 ఆసియా క్రీడలకు తాము సిద్ధం అంటూ హాంగ్జూ (చైనా) బ్యాటన్‌ అందుకుంది. ముగింపోత్సవం లో భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రాణీ రాంపాల్‌ జాతీయ జెండాను చేతబూని భారత బృందానికి ముందు కదిలింది. వేల మంది అభిమానుల సమక్షంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో ఇండోనేషియా సంప్రదాయ నృత్యాలు.. కళ్లుచెదిరేలా సాగిన లేజర్‌ షో ఆకట్టుకున్నాయి. సిద్ధార్థ్‌ సలాతియా, దెనాదా కోయి మిల్‌ గయా, కుచ్‌ కుచ్‌ హోతా హై, జై హో గీతాలు ఆలపించి రంజింపజేశారు. ప్రారంభోత్సవంలో బైక్‌ మీద వచ్చి ఆశ్చర్యపరిచిన ఇండోనేషియా అధ్యక్షుడు విడోడో ఈసారి వీడియో సందేశం ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు థామస్‌ బాక్‌, ఆసియా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు అహ్మద్‌ అల్‌ ఫహద్‌ పాల్గొన్నారు. భారత్‌కు గత ఆసియా క్రీడలకంటే ఉత్తమైన ఆసియా క్రీడలివే. ఈసారి ఆసియా క్రీడల్లో భారత బృందం 15 స్వర్ణం. 24 రజత, 30 కాంస్య పతకాల తో సహా మొత్తం 69 పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.