క్షీణిస్తున్న హార్దిక్ ఆరోగ్యం

వాస్తవం ప్రతినిధి: పాటిదార్ నేత హార్దిక్ పటేల్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు తెలుస్తుంది. పాటిదార్‌లకు రిజర్వేషన్లు, వ్యవసాయ రుణాలు అందించాలని డిమాండ్‌ చేస్తూ గత తొమ్మిది రోజులుగా నిరవధిక ఉపవాస దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, దీంతో తన ఆస్తులను ఎవరికి చెందాలో విల్లుగా రాయాలని కోరుకుంటున్నట్లు పాటిదార్‌ ప్రతినిధి వెల్లడించారు. తన ఆస్తులను తన తల్లిదండ్రులు, సోదరితో పాటు, 2015లో రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఆందోళనలో మృతి చెందిన 14మంది యువకులకు చెందుతుందని, అలాగే తన గ్రామంలోని పంచ్రపోల్‌ (ఆవుల సంరక్షణ కేంద్రం)కు చెందుతుందని పాటిదార్‌ నేత తెలిపారు. తన మరణానంతరం తన కళ్లను ఐబ్యాంక్‌కు దానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 25 నుంచి హార్దిక్ దీక్షను చేపట్టగా ఇప్పటివరకు తృణమూల్ కాంగ్రేస్ట్,నేషనలిస్ట్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు దీక్షకు మద్దతు తెలిపాయని, ఈ నేపధ్యంలో ఆయనను పలకరించేందుకు కూడా వారు వచ్చినట్లు పాటిదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి(పిఎఎఎస్‌) ప్రతినిధి మనోజ్‌ పనారా వెల్లడించారు. అయితే బిజెపి ప్రభుత్వం ఇప్పటివరకు ఈ దీక్షపై స్పందించలేదని మనోజ్‌ విమర్శించారు. హార్థిక్‌ ఆరోగ్యం క్షీణిస్తోందని, తొమ్మిది రోజుల నుండి ఆహారం తీసుకోవడం లేదని, 36గంటల నుండి నీరు కూడా తాగడం లేదని మనోజ్‌ పేర్కొన్నారు.