రైలు కింద పడి ప్రాణాలు విడిచిన ప్రేమజంట

వాస్తవం ప్రతినిధి: వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు కాదన్నారో లేక మరేదైనా.. ఏమి కష్టం వచ్చిందో కానీ.. కలసి తనువు చాలించాలని భావించారు. ఇద్దరూ కలసి రైలు కింద పడగా, ప్రియుడు అక్కడికక్కడే మరణించగా, ప్రియురాలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, విజయవాడకు చెందిన సిద్ధయ్య అనే యువకుడు, కడపకు చెందిన కాసింబీని గత కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో సిద్ధయ్య కడపకు వచ్చి కాసింబీని కలిశాడు. ఇద్దరూ కలిసి రాజంపేటకు వచ్చి ఆత్మహత్యాయత్నం చేశారు. తీవ్ర గాయాలతో పడివున్న కాసింబీని చూసిన కొందరు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.