ఆఫ్ఘన్ లోని పాక్ కన్సలేట్ ను తాత్కాలికంగా మూసివేసిన పాక్

వాస్తవం ప్రతినిధి: ఆఫ్ఘనిస్తాన్‌ తూర్పు ప్రాంతంలోని జలాలాబాద్‌ నగరంలో వున్న పాక్ తమ కన్సలేట్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పాకిస్తాన్‌ ప్రకటించింది. తమ కార్యాలయ వ్యవహారాలలో ఆఫ్ఘన్‌ ప్రావిన్షియల్‌ గవర్నర్‌ తరచు జోక్యం చేసుకుంటున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ తెలిపింది. ఆఫ్ఘన్ ప్రావిన్షియల్ గవర్నర్ తరచూ జోక్యం చేసుకోవడం తో కార్యాలయానికి భద్రత కరువైందని పాకిస్తాన్‌ ఆరోపిస్తుంది.  ఈ మేరకు కాబూల్‌లోని తమ రాయబార కార్యాలయం ఆఫ్ఘన్‌ విదేశాంగశాఖకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవటంతో తమ కన్సలేట్‌ను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్‌ ఒక ప్రకటనలో వివరించింది. తగిన రీతిలో భద్రతా ఏర్పాట్లను పునరుద్ధరించే వరకూ తమ కన్సలేట్‌ను మూసి వుంచుతామని పాకిస్తాన్‌ స్పష్టం చేసింది. జలాలాబాద్‌ కన్సలేట్‌ మూసివేత వ్యవహారం ఇరుదేశాల మధ్య గాడితప్పిన దౌత్య సంబంధాల పరిస్థితికి అద్దం పడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారంటూ రెండుదేశాలు పరస్పరం ఆరోపించుకుంటున్న విషయం తెలిసిందే.