అమెరికా లో ఆరుగురు భారతీయుల అరెస్ట్!

వాస్తవం ప్రతినిధి: ఆరుగురు భారతీయులతో పాటు సుమారు 300మందిని నేర కార్యకలాపాలకు సంబంధించి అమెరికా అధికారులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తుంది. వారంతా కూడా నేర పూరిత చర్యలకు పాల్పడటంతో పాటు వలస చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కోవడం తో వారిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. జులై 30న చికాగో ప్రాంతంలో 25ఏళ్ల వ్యక్తిని లైంగిక వేధింపుల కేసులో దోషిగా ఇల్లినాయిస్‌లో ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసిఇ) అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో ఇతర ప్రాంతాలలో కూడా పలువురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇండియానా, ఇల్లినాయిస్‌, కాన్సాస్‌, కెంటుకీ, మిస్సౌరి, విస్కాన్సిన్‌లలో 30రోజుల పాటు ఫెడరల్‌ అధికారులు గాలింపు చేపట్టి 364 నిందితులను అరెస్ట్‌ చేయగా, వీరిలో అధికంగా 236మంది మెక్సికో దేశానికి చెందినవారు ఉన్నారు. చట్ట విరుద్ధంగా దేశంలోకి ప్రవేశించడంతో పాటు దోపిడీ, పిల్లల పట్ల నిర్లక్ష్యంవంటి చర్యలకు వీరు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు.