ఘనంగా ముగిసిన మెక్ కెయిన్ అంత్యక్రియలు

వాస్తవం ప్రతినిధి: భారత్‌కు చిరకాల మిత్రుడు, అమెరికా రాజకీయాల్లో పేరెన్నికగన్న రాజనీతిజ్ఞుడు సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ అంత్యక్రియలు శనివారం వాషింగ్టన్‌లో ఘనంగా ముగిశాయి. ఆయన అంత్యక్రియల కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామాలు హాజరై  ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన అమెరికాకు అందించిన సేవలను కొనియాడారు. అయితే తన అంత్యక్రియలకు బద్ధశత్రువైన ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ హాజరుకాకూడదన్న మెక్‌కెయిన్ చివరి కోరిక మేరకు ఈ కార్యక్రమానికి ట్రంప్ దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. వాషింగ్టన్‌లోని నేషనల్ క్యాథెడ్రల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు అమెరికా మాజీ ఉపాధ్యక్షులు, భారీ సంఖ్యలో చట్టసభల సభ్యులు తదితరులు హాజరయ్యారు. ఏడాదికాలంగా బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడిన మెక్‌కెయిన్ (81) గత శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా అంత్యక్రియల కార్యక్రమానికి ట్రంప్ కుమార్తె ఇవాంక, రక్షణశాఖమంత్రి జిమ్ మ్యాటిస్, వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాన్ కెల్లీ తదితరులు హాజరయ్యారు. మెక్‌కెయిన్ భారత్-అమెరికా సంబంధాల బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు.