పవర్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు..స్పెషల్ వీడియో విడుదల చేసిన జనసేన!

వాస్తవం ప్రతినిధి: నేడు (సెప్టెంబర్ 2) జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు . ఈ సందర్భంగా పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ సెలబ్రిటీలు, అభిమానులు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. మెగా అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీధివీధి వాడవాడలా పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలను జనసేన కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు జనసేన పార్టీ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. జనసేనకు చెందిన శతాగ్ని టీమ్ దీన్ని రూపొందించింది. పవన్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు? ఆయన లక్ష్యం ఏంటి? ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? అంశాలపై జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులను ఉద్దేశించి ప్రత్యేకమైన వీడియోను ఈ రోజు రిలీజ్ చేసింది.

‘స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థను మంట కలిపి రాజకీయ విలువలను భూస్థాపితం చేశారు. ఇదంతా చూసిన ఓ సామాన్యుడి కడుపు మండింది. అతను ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. అతను అనుకోకుండా సినిమా నటుడు అయ్యాడు. అగ్రనటుడి స్థాయి అతనికి ఆనందాన్ని ఇవ్వలేదు.. బాధ్యతను ఇచ్చాయి. అదే జనసేన’ అంటూ వాయిస్ ఓవర్ తో వీడియో సాగుతోంది.

పవన్ ప్రసంగాలు, సినిమా క్లిప్స్ తో ఈ వీడియోను రూపొందించారు. ‘జనసేన గెలుపు సామాన్యుల గెలపు, జనసేన ఓడితే.. సామాన్యులు ఓడినట్లే. జనసైనికులరా రాక్షస రాజ్యం తలపెట్టిన ఈ తొలి యుద్ధానికి శతఘ్నులమై సంసిద్ధమవుదాం. అవినీతి అంతం చేసేందుకు ఎర్రటి వస్త్రాన్ని మెడలో వేసుకుని నడిచే ప్రళయ కాల రుద్రుడికి అడుగవుదాం’ అని వీడియోలో ఉంది.