కేరళలో దారుణం….భార్యను హత్య చేసిన 91 ఏళ్ల భర్త

వాస్తవం ప్రతినిధి: కేరళలోని త్రిశూరు జిల్లాలో దారుణం జరిగింది. 87 ఏళ్ల భార్యను 91 ఏళ్ల భర్త హత్య చేసినట్లు తెలుస్తుంది.  ఈ వృద్ధ దంపతులకు ఏడుగురు సంతానం. అయితే అందరికి పెళ్లిళ్లు కావడంతో అందరూ ఎక్కడికక్కడ వేర్వేరుగా ఉంటున్నారు. అయితే ఆగస్టు 27న సాయంత్రం వృద్ధ దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన భర్త.. ఇంట్లో గొడకేసి భార్య తలను కొట్టడమే కాకుండా ఆ తర్వాత చేతి కర్రతో ఆమె తలపై బాదడంతో స్పృహ తప్పి పడిపోయింది. రక్తస్రావం తీవ్రమవడంతో భార్య కన్నుమూసింది. తన భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న భర్త.. కిటికీలో నుంచి మృతదేహాన్ని బయటకు పడేశాడు. ఆ తర్వాత నిప్పంటించాడు. అయితే తన తల్లి కనిపించడం లేదని ఆగస్టు 28న ఆమె కుమారుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్ధుడిని విచారించగా అసలు విషయం వెలుగు లోకి వచ్చింది. తన భార్యను తానే హత్య చేసినట్లు భర్త ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు పోలీసులు.