అణు ఒప్పందానికి కట్టుబడి వ్యవహరిస్తున్న ఇరాన్: ఐఎఇఎ

వాస్తవం ప్రతినిధి: అమెరికా నేతృత్వంలోని ఆరుదేశాల కూటమితో కుదుర్చుకున్న అణుఒప్పందంలోని నియమ నిబంధనలకు ఇరాన్‌ ఇప్పటికీ కట్టుబడి వ్యవహరిస్తోందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఎఇఎ) స్పష్టం చేసింది. ఈ ఒప్పందం నుండి అమెరికా వైదొలగి, ఇరాన్‌పై ఆంక్షలు పునరుద్ధరించిన తరువాత దీని భవితపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ఐఎఇఎ తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించటం గమనార్హం. ఇరాన్‌లో అణు కార్యక్రమాలు కొనసాగుతున్న అన్ని ప్రదేశాలను సందర్శించేందుకు తమకు వెసులుబాటు లభించిందని ఐఎఇఎ తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే ఈ ప్రాంతాలను పరిశీలించటానికి తమకు సమయానుకూలంగా ఇరాన్‌ సహకరించటం అత్యంత ప్రధానమని ఐఎఇఎ వ్యాఖ్యానించింది. ఇరాన్‌లో శుద్ధి చేసిన యురేనియం, భారజల నిల్వలు గత నివేదికలో పేర్కొన్న మొత్తం కంటే కొద్దిగా పెరిగినప్పటికీ ఒప్పందం పరిధిలోనే వున్నాయని వివరించింది. తమ దేశ ప్రయోజనాలకు ఉపయోగపడని అణు ఒప్పందాన్ని పక్కన పెట్టేందుకు తాము సిద్ధంగా వున్నామని బుధవారం నాడు ఇరాన అధినేత ఆయతుల్లా ఖొమేనీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఒప్పందం విషయంలో ఐరోపా కూటమితో చర్చలు కొనసాగుతాయని ఆయన వివరించారు.