పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన టర్న్ బుల్

వాస్తవం ప్రతినిధి: ఇటీవల ఆస్ట్రేలియా ప్రధాని పదవికి రాజీనామా చేసిన మాల్కోమ్ టర్న్ బుల్ ఇప్పుడు పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. దీనితో ఒక్కసీటు మెజార్టీతో వున్న ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఇటీవల జరిగిన పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలయిన టర్న్‌బుల్‌ తాను పార్లమెంట్‌కు రాజీనామా చేస్తానని గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో టర్న్‌బుల్‌ రాజీనామా లేఖ శుక్రవారం మధ్యాహ్నం స్పీకర్‌కు అందిందని పార్లమెంట్‌ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిన నేపథ్యంలో కీలకమైన బిల్లులకు ఆమోదముద్ర పొందటంలో ప్రభుత్వానికి సహకరించాలని కొత్త ప్రధాని స్కాట్‌ మారిసన్‌ ప్రతిపక్షాలను కోరారు. మరో ఎనిమిది నెలల్లో పార్లమెంట్‌ ఎన్నికలు జరుగనున్నందున కొత్త ప్రధాని మారిసన్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. పార్లమెంట్‌ దిగువ సభలో మెజార్టీ కోల్పోయిన ప్రభుత్వానికి ఎగువ సభలో కూడా మెజార్టీ లేదన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మేలో జరుగనున్న ఎన్నికల్లో గెలిచేందుకు ప్రస్తుత పాలక లిబరల్‌ నేషనల్‌ కూటమి గట్టిగా శ్రమించాల్సిందేనని తాజా ఒపీనియన్‌ పోల్స్‌ చెబుతున్నాయి.