స్క్వాష్ లో రజత పతకం తో సరిపెట్టుకున్న భారత్

వాస్తవం ప్రతినిధి: ఆసియా క్రీడల్లో మరో బంగారు పతకాన్ని దక్కించుకోవాలన్న భారత్‌కు నిరాశే ఎదురైంది. స్క్వాష్‌ మహిళల టీమ్‌ విభాగంలో ఫైనల్‌ చేరి మురిపించిన భారత జట్టు చివరికి రజతం సరిపెట్టుకుంది. హాంకాంగ్‌తో జరిగిన ఫైనల్లో 2-0తో ఓడిపోయిన భారత్‌ రజత పతకం గెలుచుకుంది.  తొలి సింగిల్స్‌‌లో సునన్య కురువిల్ల ఓటమితో భారత్‌ 0-1తో వెనుకబడింది. ఆ తర్వాత రెండో సింగిల్స్‌లో జోష్న చిన్నప్ప కూడా ఓడిపోవడంతో హాంకాంగ్‌ 2-0తో విజయం సాధించి స్వర్ణం ఎగరేసుకుపోయింది. దీంతో స్క్వాష్‌ మహిళల విభాగంలో భారత్‌ రజతంతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది. ఇప్పటి వరకు భారత్‌ 18వ ఆసియా క్రీడల్లో 68 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో స్వర్ణాలు 15, రజతాలు 24, కాంస్యాలు 29 ఉన్నాయి. ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌ ఇన్ని పతకాలు గెలవడం ఇదే తొలిసారి. 2010లో అత్యధికంగా భారత్‌ 65 పతకాలు గెలిచింది.