మానస సరోవర యాత్రకు బయలుదేరిన రాహుల్ గాంధీ!

వాస్తవం ప్రతినిధి: శివుడికి మొక్కు చెల్లించుకునేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కైలాస మానస సరోవర యాత్రకు బయలుదేరారు.కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ఈ విషయాన్ని వెల్లడించారు . తనని శివ భక్తుడిగా ప్రకటించుకున్న రాహుల్ శివ భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ యాత్ర చేపట్టనుండటం ఇప్పుడు కాషాయ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది.
రాహుల్ మానస సరోవర యాత్రపై బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది. చైనా మీదుగా రాహుల్ మానస సరోవర యాత్రకు బయలుదేరినట్టు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. చైనాకు రాహుల్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మరోవైపు, బీజేపీ ఆరోపణలపై సూర్జేవాలా ఘాటుగా స్పందించారు. మానస సరోవర యాత్రకు ప్రధాని అనుమతి తీసుకోవాలా? అని ప్రశ్నించారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో కర్ణాటక పర్యటన సందర్భంగా రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. హుబ్బళ్లి వద్ద తృటిలో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడితే తాను మానస సరోవరంలో శివుడిని దర్శించుకుంటానని మొక్కుకున్నారు. ఈ మేరకు మొక్కు తీర్చుకునేందుకు శుక్రవారం రాహుల్ యాత్రకు బయలుదేరారు.