హరికృష్ణ నక్కను పెంచుకొనే వారట. . ఎందుకో తెలుసా?

వాస్తవం ప్రతినిధి: హరికృష్ణ జీవితంలో ఇదో ఆసక్తికరమైన విషయం. పశుపక్ష్యాదులంటే ఎంతో ప్రేమ, మక్కువను చూపించే ఆయన ఎన్నో రకాల జంతువులను, పక్షులను పెంచుకుంటూ, వాటితో గడుపుతూ సేదదీరుతుంటారన్న సంగతి తెలిసిందే. అలాగే నందమూరి కుటుంబానికి సెంటిమెంట్లు ఎక్కువగానే ఉంటాయంటారు. తిథి, నక్షత్రం, వారం, వర్జ్యం, జాతకాలు, ముహూర్తాలు, చేతికి, మెడలోకి వివిధ రకాల హారాలు, రుద్రాక్షలు, పూజలు, హోమాలు, వ్రతాలు అన్నీ చేస్తుంటారు. తండ్రి ఎన్టీఆర్ నుంచే వారికి ఈ సంప్రదాయం వచ్చింది. అందుకే బాలకృష్ణ, హరికృష్ణ సహా ఎన్టీఆర్ వారసులు వివిధ రకాల ఉంగరాలు, మెడలో హారాలు, ముంజేతికి రకరకాల కడియాలు ధరిస్తుంటారు.
వీటితో పాటు హరికృష్ణకు పశుపక్షాదులంటే మహా ఇష్టం. ఆయన హైదరాబాద్ లోని తన హోటల్ తో పాటు, నివాసం, నిమ్మకూరులోని నివాసంలోనూ, ఫామ్ హౌస్ లో వివిధ రకాల పక్షులు, కోళ్లు, ఆవులు, గేదెలు, కుందేళ్లు, జంతువులను పెంచుకునేవారు. వాటితో పాటు ఓ నక్కను కూడా పెంచేవారని సన్నిహితులు చెబుతున్నారు. ప్రతిరోజూ నక్క ముఖం చూస్తే మంచి జరుగుతుందని హరికృష్ణ విశ్వసించేవారట. నక్క మొకం చూడటం వల్ల పలు దోషాలు కూడా తొలగిపోతాయని ఎవరో సిద్ధాంతి చెప్పడంతో అప్పటి నుంచి నక్కను పెంచేవారని తెలిసింది.