సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

వాస్తవం ప్రతినిధి: సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట దగ్గర ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వెళుతున్న లారీని తుపాన్ వాహనం ఢీకొంది. దీంతో తుపాన్ వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా… గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మృతిచెందినవారు హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.