ఎస్-400 క్షిపణి కొనుగోలు విషయంలో కృత నిశ్చయం తో ఉన్నాం: టర్కీ

వాస్తవం ప్రతినిధి: రష్యా నుంచి ఎస్-400 తరహ క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు విషయంలో తాము కృత నిశ్చయం తో ఉన్నట్లు టర్కీ మరోసారి స్పష్టం చేసింది. తమ రక్షణ వ్యవస్థకు అవసరమైన ఈ క్షిపణి ని రష్యా నుంచి కొనుగోలు చేయాలనీ భావిస్తున్నట్లు టర్కీ తెలిపింది. టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లు ట్‌ కావుసోగ్లు మీడియా తో మాట్లాడుతూ అమెరికా కౌబాయ్ సినిమాల తరహాలో తన తోటి నాటో సభ్యదేశాలను బెదిరించటం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. రష్యాతో కుదుర్చుకున్న ఎస్‌-400 కొనుగోళ్ల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలన్న డిమాండ్‌కు తాము తలొగ్గబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తొలి క్షిపణి రక్షణ వ్యవస్థ వచ్చే ఏడాది తమకు అందుతుందని ఆయన వివరించారు. ఈ క్షిపణి రక్షణ వ్యవస్థలు తమ దేశ రక్షణకు అవసరమని, గతంలో తాము అమెరికా తయారీ పేట్రియాట్‌ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపినా, అందుకు సంబంధించిన ఒప్పందానికి కాంగ్రెస్‌ ఆమోదం లభిస్తుందన్న హామీని ఇవ్వలేకపోయిందని ఆయన వివరించారు. తాము తమ గగన తలాన్ని రక్షించుకోవాల్సిన అవసరం వుందని, ఇందుకు క్షిపణి రక్షణ వ్యవస్థలు తప్పని సరి అని ఆయన స్పష్టం చేశారు.