ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న గూఢ చారులను అరెస్ట్ చేసిన ఇరాన్ భద్రతా బలగాలు

వాస్తవం ప్రతినిధి: ప్రభుత్వ సంస్ధల్లో పని చేస్తున్న పలువురు గూఢచారులను ఇరాన్‌ భద్రతా బలగాలు అరెస్టు చేశాయని ఇంటెలిజెన్స్‌ శాఖ మంత్రి మంగళవారం తెలిపారు. ఇరాన్‌పై అమెరికా తిరిగి ఆంక్షలు విధించిన నేపథ్యంలో పశ్చిమ దేశాలు, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన పరిస్థితుల్లో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ అరెస్టులు ఎప్పుడు జరిగాయి, ఏ దేశాల తరపున ఈ గూఢచారులు పనిచేస్తున్నారనే వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు. అయితే అదుపులోకి తీసుకున్న వారిలో చాలామందికి ద్వంద్వ పౌరసత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో మంత్రి మహ్మద్ అలవి ఎవరైనా ద్వంద్వ పౌరసత్వం కలిగివుంటే వారి గురించి తమకు తెలియచేయాల్సిందిగా  అక్కడి ప్రజలను కోరారు. ఇంటెలిజెన్స్‌ శాఖకు చెందిన గూఢచర్య నిరోధక విభాగం పలువురు విదేశీ గూఢచారులను గుర్తించిందని, వీరందరూ కూడా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారని అధికార వార్తా సంస్థ ఇస్నా తెలిపింది.