కారు రేసింగ్ కు కూడా సిద్దమే అంటున్న సౌదీ మహిళలు

వాస్తవం ప్రతినిధి: కొద్ది నెలల క్రితం వరకూ కలగానే మిగిలిన కారు డ్రైవింగ్‌ చక్రం ఇప్పుడు చేతుల్లోకి రావటంతో సౌదీ మహిళలు కార్లలో చక్కర్లు కొడుతున్నారు. మరింత రెట్టించిన ఉత్సాహంతో వారు సౌదీ వీధులలో దూసుకుపోతున్నారు. ప్రపంచంలో మహిళల కారు డ్రైవింగ్‌పై నిషేధం వున్న ఏకైక దేశం సౌదీ అరేబియా అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల యువరాజు మహ్మద్‌ బీన్‌ సల్మాన్‌ చేపట్టిన సంస్కరణల్లో భాగంగా మహిళలను కారు డ్రైవింగ్‌కు అనుమతించడం తో ఇప్పుడు సౌదీ వీధులలో మహిళలు కారులలో షికారులు చేస్తున్నారు. అంతేకాకుండా తమకు కారు రేసుల్లో పాల్గొనే అవకాశాన్ని కూడా కల్పించాలని మహిళలు సౌదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం డ్రైవింగ్‌కు అనుమతించిన ఉత్సాహంతో ఇప్పుడు మహిళలు తమ కార్లతో విన్యాసాలు చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. అయితే ప్రజల భద్రత దృష్ట్యా కార్‌ డ్రైవింగ్‌లో వేగ పరిమితులు విధించింది. అయితే గతంలో పురుషులకు మాత్రమే పరిమితమైన స్పీడ్‌ డ్రైవింగ్‌ను ఇప్పుడు తమకు అనుమతించాలని మహిళలు కోరుతున్నారు.