ఆసియా క్రీడల్లో భారత్ కు మరో పతకం ఖాయమైంది!

వాస్తవం ప్రతినిధి: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. మహిళల స్క్వాష్‌ జట్టు ఫైనల్‌కు చేరుకోవడం తో భారత్ కు పతకం ఖాయం అయ్యింది. జోష్న చినప్ప, దీపికా పల్లికల్‌, సునయనా కురువిల్లా, తన్వీ ఖన్నాతో కూడిన భారత జట్టు 2-0తో మలేషియాను ఓడించింది. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో తొలి రౌండ్‌ నుంచి భారత మహిళల జట్టుదే ఆధిపత్యం కావడంతో స్వర్ణానికి మార్గం సుగమమైంది. ఈ ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు ఇరాన్‌, థాయ్‌లాండ్‌, ఇండోనేషియా, చైనాలను ఓడించి భారత్‌ సెమీస్‌ కు చేరుకుంది. ఇంచియాన్‌లో 2014లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత మహిళలు రజత  పతకం గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి కూడా భారత్ కు స్వర్ణం కానీ రజతం కానీ దక్కే అవకాశాలు ఉన్నాయి. అలానే మహిళల స్క్వాష్‌ సింగిల్స్‌ విభాగంలో దీపికా పల్లికల్‌కు కాంస్యం గెలిచినా సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో భాగంగా మహిళల సింగిల్స్‌లో దీపిక సెమీ‌ ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నికోల్‌ డేవిడ్‌(మలేషియా) చేతిలో ఓటమి పాలైంది. ప్రపంచ నంబర్‌వన్‌ నికోల్‌ 11-7, 11-9, 11-6 తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. 2014లో జరిగిన ఆసియా క్రీడల్లోనూ దీపిక… నికోల్‌ చేతిలోనే ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు కూడా అదే ప్రత్యర్థి చేతిలో ఓటమిపాలై కాంస్యంతోనే వెనుదిరిగింది.