రజతం సాదించడం ఆనందంగా ఉంది: సింధు

వాస్తవం ప్రతినిధి: ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రజత పతకాన్ని సాదించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.  ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించకపోయినప్పటికీ రజత పతకాన్ని సాధించడం ఆనందంగా ఉందని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో గోపీచంద్‌, సింధు, సైనా నెహ్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఆసియా క్రీడల్లో ప్రతి మ్యాచ్ ప్రత్యేకంగా జరిగిందని సింధు తెలిపారు. ఫైనల్‌లో పదే పదే ఓడిపోవడం పట్ల స్పందిస్తూ.. ఫైనల్ ఫోబియా తనకు లేదని, ఫైనల్‌ వరకు రావడం ఎంత కష్టమో అలోచించాలని కోరారు. మున్ముందు మరింత ఎక్కువగా సాధన చేసి స్వర్ణ పతకాన్ని తప్పక సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆసియా క్రీడల్లో ఇద్దరు క్రీడాకారులు పతకాలు సాధించడం ఆనందంగా ఉందని శిక్షకులు గోపీచంద్‌ అన్నారు. ఎక్కువమంది క్రీడాకారులు మున్ముందు మరిన్ని ఎక్కువ పతకాలు సాధిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గెలుపోటములు సహజమని, ఆడిన ప్రతి మ్యాచ్‌లో గెలవడం సాధ్యం కాదని మరో క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అన్నారు. మున్ముందు స్వర్ణ పతకం సాధించేందుకు శ్రమిస్తానని చెప్పారు.