ద్యుతిచంద్ మరో సంచలన ప్రదర్శన ….మరో రజతం!

వాస్తవం ప్రతినిధి: ఈతరం పరుగుల రాణి ద్యుతిచంద్ ఆసియా క్రీడల్లో మరో సంచలన ప్రదర్శన  చేసింది. భారత్‌కు వ్యక్తిగతంగా రెండో రజతం ని అందించింది. బుధవారం జరిగిన మహిళల 200 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానంలో నిలవడం ఆసియా క్రీడల్లో ఒకటి కన్నా ఎక్కువ పతకాలు సాధించిన పీటీ ఉష, జ్యోతిర్మయి వంటి దిగ్గజ అథ్లెట్ల సరసన నిలిచింది.

అంతకు ముందు 100 మీటర్ల పరుగులో రజతం గెలిచిన ద్యుతీ 200 మీటర్ల పరుగులో తన సత్తా చూపించింది. 23.20 సెకన్లలో గమ్యాన్ని చేరింది. బహ్రెయిన్‌కు చెందిన ఎడిడియాంగ్‌ ఓడియాంగ్‌ 22.96 టైమింగ్‌తో స్వర్ణం ఎగరేసుకుపోయింది. పురుష హార్మన్లు (హపర్‌యాండ్రోజెనిసమ్‌) అధికంగా ఉన్నాయంటూ ఆమెను 2014లో ఆసియా క్రీడల్లో పోటీపడనివ్వలేదు. స్పోర్ట్స్‌ ఆర్బిట్రేజ్‌ కోర్టులో పోరాడిన ద్యుతీ తిరిగి కఠోర సాధన చేసింది. అకుంఠిత దీక్షతో అందరినీ మెప్పించి ఈ సారి ఆసియా క్రీడల్లో రెండు రజతాలు సాదించింది.