ఐఆర్సీటీసీ కుంభకోణం లో లాలూ కుటుంబానికి భారీ ఊరట

వాస్తవం ప్రతినిధి: ఐఆర్‌సీటీసీ కుంభకోణానికి సంబంధించిన కేసులో రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి ఊరట లభించింది. భారత రైల్వే కేటరింగ్ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) హోటళ్ల టెండర్లకు సంబంధించిన కుంభకోణం కేసులో లాలూ, ఆయన భార్య, కుమారుడు తేజస్వీ యాదవ్‌తో పాటు మరికొందరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2006లో రాంచీ, పూరిలోని ఐఆర్‌సీటీసీ హోటళ్లను ప్రయివేటు సంస్థలకు అప్పగించారు. ఆ సమయంలో లాలూ రైల్వేశాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఈ కాంట్రాక్టులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. టెండర్లు తమకు వచ్చేలా చేసినందుకు గానూ.. సదరు ప్రయివేటు సంస్థలు లాలూ కుటుంబానికి పట్నాలో మూడెకరాల కమర్షియల్‌ ఫ్లాట్‌ను ఇచ్చినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో లాలూ సతీమణి, బిహార్‌ మాజీ సీఎం రబ్రీదేవీ, ఆయన కుమారుడు, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు ఢిల్లీ లోని పాటియాలా హౌస్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వ్యక్తిగత పూచికత్తు కింద రూ. లక్ష చొప్పున జమ చేయాలని చెబుతూ వారికి బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులందరికీ కోర్టు బెయిల్‌ ఇచ్చింది.