జమ్ము కశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. పోలీసు శాఖలో పనిచేస్తున్న వారు, జవాన్లే లక్ష్యంగా కిడ్నాప్ లు

వాస్తవం ప్రతినిధి:  జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు తెగబడ్డారు. రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న వారు, జవాన్లే లక్ష్యంగా కిడ్నాప్ లు చేశారు. సోఫియాన్, కుల్గాం, అనంతనాగ్, అవంతీపురా తదితర ప్రాంతాల్లో నిన్న రాత్రి మూకుమ్మడి కిడ్నాప్ లు జరిగాయి. కనీసం 9 మంది పోలీసులు, జవాన్ల బంధువులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.
అంతర్జాతీయ వాంటెడ్ టెర్రరిస్టు సైయద్ సలాహుద్దీన్ రెండో కుమారుడిని ఎన్ఐఏ అరెస్టు చేయడంతో ఉగ్రవాదులు ఈ తాజా దుశ్చర్యకు పాల్పడ్డారు. అయితే పోలీసు కుటుంబాలకు చెందిన వారిని ఉగ్రవాదులు ఎత్తుకెళ్లడంపై ఉన్నతాధికారుల నుంచి అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అపహరణల వార్తలను ఇంకా నిర్దారణ చేయాల్సి ఉందంటున్నారు. ఈ పరిణామాన్ని అధికార వర్గాల సన్నిహితులు మాత్రం ధ్రువీకరిస్తూ, జమ్మూకశ్మీర్ పోలీసులుగా పనిచేస్తున్న కుటుంబాలకు చెందిన తొమ్మిది మందిని షోపియాన్, కుల్గాం, అనంతనాగ్, అవంతిపోరా నుండి ఉగ్రవాదులు ఎత్తుకెళ్లినట్టు చెబుతున్నారు. కాగా, ఉగ్రవాదులు 11 మందిని అపహరించారంటూ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఒక ట్వీట్‌లో తెలిపారు.