‘జనసేన’లో చేరిన పలు పార్టీల నేతలు

వాస్తవం ప్రతినిధి: ‘ప్రజల సమస్యలను ఓపికగా వినే నాయకులు లేకుండా పోతున్నారు. కనీసం ఎంపీటీసీ కూడా ప్రజల బాధలు వినడంలేదు’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను వినాలని, సినిమాల్లో మాదిరిగా రెండు, మూడు గంటల్లో సమస్యలు పరిష్కారమై పోవని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేశ్‌, డీసీసీ మాజీ అధ్యక్షుడు పంతం వెంకటేశ్వరరావు (నానాజీ)తోపాటు పలువురు నేతలు గురువారం జనసేనలో చేశారు. ఈ సందర్భంగా మాదాపూర్‌లోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పవన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ,

పార్టీలోకి కందుల దుర్గేష్, నానాజీలకు సాదర ఆహ్వానం పలుకుతున్నానని అన్నారు. ఇది తన పార్టీ అని ఎప్పుడూ అనుకోలేదని, ‘నా’ అనే భావన ఎప్పుడూ తనకు ఉండదని, ‘మనది, మనం’ అనే భావనలే ఉంటాయని అన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించాలని, నాలుగు గోడల మధ్య కూర్చుని సమస్యలను పరిష్కరిస్తామంటే సరికాదని హితవు పలికారు. తాను నమ్మిన, సాధన చేసిన సిద్ధాంతాలనే చెబుతున్నానని, క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించాలని,   సమస్యలకు పరిష్కరాలు చూపించడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళదామని, రాజకీయాలు స్వల్పకాలిక ప్రయోజనాల కోసం చేయడం లేదని, దీర్ఘకాలిక ప్రయోజనాలతో, భావితరాల క్షేమం కోసం వచ్చానని పవన్ పేర్కొన్నారు.