న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో పేలిన పవర్ బ్యాంక్

వాస్తవం ప్రతినిధి: మొబైల్ కు ఛార్జింగ్ పెట్టే పవర్ బ్యాంక్ పేలిన ఘటన న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఓ నటి, సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడి, పవర్ బ్యాంకును విసిరేయగా అది పేలింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు, ఆపై బెయిల్ మీద విడిచిపెట్టారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఆ నటి తన హ్యాండ్ బ్యాగులో పవర్ బ్యాంకును పెట్టుకుని సెక్యూరిటీ చెకింగ్ వద్దకు వచ్చింది. ఆ సమయంలో పవర్ బ్యాంకును తీసి బయట పెట్టాలని అక్కడున్న అధికారులు కోరడంతో, ఆమె వాగ్వాదానికి దిగింది. ఆ సందర్భంగా ఆగ్రహంతో, పవర్ బ్యాంక్ తీసి ఆమె నేలకేసి కొట్టగా, అది కొద్దిపాటి శబ్దం చేస్తూ పేలింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఆమెను బెయిల్ పై విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఆమె ఎవరన్న విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు.