అధికారిక లాంఛనాలతో ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు

వాస్తవం ప్రతినిధి: దివంగత హరికృష్ణ అంతిమయాత్ర ముగిసింది. మెహిదీపట్నంలోని నివాసం నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానానికి ఆయన పార్థివదేహం చేరుకుంది. సీఎం చంద్రబాబు స్వయంగా తన బావమరిది హరికృష్ణ పాడె పట్టుకున్నారు. హరికృష్ణ పార్థివదేహంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌, కుటుంబ సభ్యులు అశ్రునయనాలతో ముందు నడిచారు. ‘హరికృష్ణ అమర్ రహే’ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. దాదాపు పది కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగి మహాప్రస్థానం చేరుకుంది.
తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది. దహనం కోసం గంధపుచెక్కలతో ఏర్పాట్లు చేశారు. ఆయన కుమారుడు నందమూరి కళ్యాణ్ రామ్ చితికి నిప్పటించారు. మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో జరిగిన ఈ అంత్యక్రియల్లో హరికృష్ణ పార్థీవదేహానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతూ గౌరవ వందనం సమర్పించారు. అంత్యక్రియల్లో సినీ, రాజకీయ ప్రముఖులు, వేలాదిమంది అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.