బిచ్చ గాడిని కొట్టి చంపినప్రముఖ మోడల్

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో అతడో ప్రముఖ మోడల్, ఒక బిచ్చగాడిని కొట్టి చంపాడు. ఆ మోడల్ పేరు హివో గొంజాలెజ్. ఇటీవల మియామిలో పెట్రోల్ బంకులో ఓ వ్యక్తితో తగాదాపడి చేయిచేసుకున్నాడు. అయితే ఆ వ్యక్తి కింద పడిపోతే వదిలేసి వెళ్లిపోయాడు. దీనికి సంబందించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరా ల్లో నమోదైంది. అయితే దెబ్బలు తిన్న వ్యక్తి లేచి మామూలుగా ఇంటికి నడచుకుంటూ పోతే గొడవే లేదు. కానీ అతడు లేవలేదు. దాంతో దవాఖానలో చేర్చారు. కొద్దిరోజుల అనంతరం అతడు దవాఖానలోనే చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీంతో గొంజాలెజ్ మీద మర్డర్ కేసు బుక్కయింది. చనిపోయిన వ్యక్తి పేరు పెడ్రో క్రూజ్. సొంత ఇల్లు కూడా లేని పేదవాడు, అడుక్కుతిని జీవనం సాగిస్తున్నాడు. పెట్రోల్ బంకు లో గొంజాలెజ్‌ను ఏమైనా ఇవ్వమని అడిగాడు. కండలు తిరిగిన మోడల్ మండిపడ్డాడు. కారు దిగి బ్యాటుతో క్రూజ్ తలమీద రెండుసార్లు కొట్టాడు. అయితే గొంజాలెజ్ మాత్రం తాను కావాలని దాడిచేయలేదని, తనను కొట్టడానికి వస్తే ఆత్మరక్షణకు ఎదురుదాడి చేశానని తనను తాను సమర్థించుకుంటున్నాడు. అది జీవన్మరణ పరిస్థితి. క్రూజ్ తీవ్రంగా గాయపడ్డట్టు తెలియదు. జరిగినదానికి చింతిస్తున్నాం.. నా క్లయింటు హంతకుడు కాదు అని గొంజాలెజ్ తరఫు న్యాయవాది కోర్టులో ప్రకటించాడు.