రెండు దేశాల, నాలుగు రోజుల పర్యటనకు వెళ్లిన సుష్మా స్వరాజ్

వాస్తవం ప్రతినిధి: రెండు దేశాల, నాలుగు రోజుల పర్యటనకు వెళ్లిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కంబోడియా మంత్రితో అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఆమె కంబోడియా ప్రధానమంత్రి హూన్ సేన్, సెనేట్ అధ్యక్షుడు సే చుంని కలిశారు. కంబోడియా విదేశాంగ శాఖ మంత్రి ప్రాక్ సొఖోన్ తో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, బహుళ సహకార సంబంధాలపై సుష్మా స్వరాజ్ చర్చించారు. పరస్పరం సహకరించుకోవాలనే రెండు ఒప్పందాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సంతకాలు చేశారు.
అంతకు ముందు వియత్నాం పర్యటనలో అక్కడి విదేశాంగ శాఖ మంత్రి ఫాం బిన్ మిన్‌తో చర్చించారు. రెండు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులను మరింతగా పెంచుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై ఇరుదేశాల మంత్రులు చర్చలు జరిపారు. అంతేకాకుండా పెట్టుబడులు, రక్షణ రంగంలో సహకారంపై ఆమె చర్చలు జరిపారు. ఆ తరువాత కంబోడియా చేరిన సుష్మా స్వరాజ్ అక్కడి విదేశాంగ మంత్రితో ఇరుదేశాల సంబంధాలపై విస్తృతంగా చర్చించారు.