ఆసియాడ్‌లో భారత హాకీ అమ్మాయిలు అదరగొట్టారు

వాస్తవం ప్రతినిధి: ఆసియాడ్‌లో భారత హాకీ అమ్మాయిలు అదరగొట్టారు. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలు సాధిస్తూ అదేజోరులో ఫైనల్‌కు దూసుకెళ్లారు. సెమీఫైనల్లో 1-0 గోల్స్‌ తేడాతో మూడుసార్లు చాంపియన్‌ చైనాను ఓడించి రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి టైటిల్‌పోరులో నిలిచారు. మ్యాచ్‌లో ఏకైక గోల్‌ను భారత స్ట్రయికర్‌ గుర్జీత్‌ కౌర్‌ 52వ నిమిషంలో సాధించింది. ఆసియాడ్‌లో మహిళల హాకీ ప్రవేశపెట్టిన 1982 క్రీడల్లో విజేతగా నిలిచిన భారత్‌.. ఆ తర్వాత మరెప్పుడూ టైటిల్‌ నెగ్గలేకపోయింది. చివరిసారిగా మన అమ్మాయిల బృందం 1998 బ్యాంకాక్‌ క్రీడల్లో ఫైనల్‌ చేరినా.. అప్పట్లో రన్నరప్‌తోనే సరిపెట్టుకొంది. ఆ తర్వాత ఇప్పుడే తుదిపోరులో నిలిచిన భారత్‌.. జపాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీ్‌సలో జపాన్‌ 2-0తో ఐదుసార్లు విజేత దక్షిణ కొరియాపై గెలిచింది.