టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

వాస్తవం ప్రతినిధి: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇప్పటవరకూ జరిగిన మూడు టెస్టుల్లో ఇంగ్లండ్‌ రెండు గెలవగా, భారత్‌ ఒక మ్యాచ్‌లో గెలిచింది. దాంతో విరాట్‌ సేన 1-2తో వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే యోచనతో టీమిండియా బరిలోకి దిగుతుండగా, ముందుగానే సిరీస్‌ను సాధించాలనే పట్టుదలతో ఇంగ్లండ్‌ పోరుకు సిద్దమైంది.

ఇదిలా ఉంచితే తాజా టెస్టులో టీమిండియా ఎటువంటి మార్పుల్లేకుండా ఆడనుంది. ఫలితంగా కోహ్లి కెప్టెన్సీలో తొలిసారి మార్పులేకుండా మొదటిసారి టెస్టు మ్యాచ్‌ ఆడుతోంది. ఇప్పటివరకూ కోహ్లి నాయకత్వంలో భారత్‌ 38 టెస్టులు ఆడగా, ఏ ఒక్కసారి ఆడిన జట్టుతో మళ్లీ బరిలోకి దిగలేదు. అయితే ఇంగ్లండ్‌తో నాల్గో టెస్టు మ్యాచ్‌ భారత్‌కు కీలకం కావడంతో మార్పులేకుండా ఆడాలని విరాట్‌ ముందుగానే నిర్ణయించుకున్నాడు.