అంతిమ యాత్ర లో పాల్గొన్న సినీ రాజకీయ ప్రముఖులు..హరికృష్ణ అమర్ రహే అంటూ నినాదాలు

వాస్తవం ప్రతినిధి: దివంగత హరికృష్ణ అంతిమయాత్ర మెహిదీపట్నంలోని నివాసం వద్ద నుంచి మహాప్రస్థానం వైపు అంతిమయాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా అంతిమయాత్ర కొనసాగుతున్న రోడ్డు జనసంద్రంగా మారాయి. అశేషమైన అభిమానులతో రోడ్లు నిండిపోయాయి. హరికృష్ణ చివరి చూపు కోసం భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. చైతన్య రథసారిథి నందమూరి హరికృష్ణ అంతిమ యాత్ర లో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
హరికృష్ణ భౌతికకాయంపై గౌరవంగా తెలుగుదేశం పార్టీ జెండాను కప్పారు… నందమూరి ఫ్యామిలీ సభ్యులతో కలిసి హరికృష్ణ భౌతికకాయం ఉన్న పాడేను తన భుజంమై మోసి… అంతిమ యాత్ర కోసం సిద్ధం చేసిన వాహనంలో ఎక్కించారు ఏపీ సీఎం చంద్రబాబు… అంతిమయాత్ర వాహనంలో ఏపీ సీఎం చంద్రబాబు, దగ్గుబాటి, యార్లగడ్డ, జస్టిస్ చలమేశ్వర్ తదితరులుండగా… అంతిమ యాత్రను నందమూరి కుటుంబ సభ్యులు, ఏపీ మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు అనుసరిస్తున్నారు.
ఈ సందర్భంగా హరికృష్ణ అమర్ రహే… జోహార్ హరికృష్ణ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.