‘నిక్కచ్చిగా, ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడటంలో హరికృష్ణ దిట్ట’: వెంకయ్యనాయుడు

వాస్తవం ప్రతినిధి:  నందమూరి హరికృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించుకోవడానికి సినీ రాజకీయ ప్రముఖులందరూ తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హరికృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నిక్కచ్చిగా, ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడటంలో హరికృష్ణ దిట్ట. తండ్రికి తగ్గ తనయుడిగా చంచలమైన ఆత్మ విశ్వసంతో, ఏపని చేసినా చిత్తశుద్ధితో చేసేవారు. ఆయన దుర్మరణం పాలవడం చాలా విచారకరం. తను చెప్పదలుచుకున్నది ముఖం మీద నిర్మొహమాటంగా చెప్పేవారు. అవతలవాళ్ళు ఏమనుకున్నా పట్టించుకునేవారు కాదు.

రాజ్యసభలో కూడా హరికృష్ణ తెలుగులోనే మాట్లాడారు. ఆరోజుల్లోని నియమ నిబంధనల ప్రకారం రాజ్యసభలో తెలుగు మాట్లాడ్డానికి వీల్లేదని స్పీకర్ చెప్పారు. అయినా హరికృష్ణ తన గొంతు వినిపించారు. రాష్ట్ర విభజన అప్పుడు కూడా చాలా ఆవేదన చెందారు. సినీ రాజకీయ రంగాల్లో తనదైన ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఈరోజు ఆయన లేరన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాను’ అని తన సంతాపాన్ని తెలియజేశారు వెంకయ్యనాయుడు.
మరోవైపు ఇవాళ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ పార్దివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.