నోట్ల రద్దు నిర్ణయంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : కేజ్రీవాల్‌

వాస్తవం ప్రతినిధి: కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. నోట్ల రద్దు ద్వారా ప్రభుత్వం ఏం సాధించిందో దేశ ప్రజలకు తెలపాలని ఆయన నిలదీశారు.మోడీ చెప్పినట్టు నోట్ల రద్దుతో అవినీతి ఆగలేదని, నల్లధనం వెలికి రాలేదని, ఉగ్రవాదం సమసి పోలేదని విమర్శించారు. స్కాముల్లో కెల్లా అతిపెద్ద స్కాం నోట్ల రద్దు అని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా సామాన్యులు అష్టకష్టాలు పడ్డారని అన్నారు. బ్యాంకుల చుట్టుతిరుగలేక, క్యూలైన్లలో నిలబడలేక అవస్థలు పడ్డారని, రాత్రికి రాత్రే నిర్ణయాన్ని ప్రకటించి దేశంలో కొంత మంది చావుకు కారణమయ్యారని అరోపించారు. తెలుసుకునే హక్కు వారికి ఉందని ఘాటుగా స్పందించారు. 99.3శాతం రద్దయిన నోట్లు వెనక్కి వచ్చినట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపిన వార్షిక నివేదికను తన ట్విట్టర్ ఖాతాలో పొందుపర్చారు.