హరికృష్ణ అకాల మృతిపై లక్ష్మీ పార్వతి స్పందన

వాస్తవం ప్రతినిధి: ఎన్టీ రామారావు తనయుడు హరికృష్ణ మరణం తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కచి వేస్తోంది.నందమూరి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగి పోయారు. నందమూరి కుటుంబ పెద్ద చనిపోవడంతో మొత్తం కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యారు.
నందమూరి హరికృష్ణ అకాల మృతిపై లక్ష్మీపార్వతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణ మరణ వార్తను విని తట్టుకోలేక పోతున్నానని అన్నారు. ఒక మీడియా సంస్థతో మాట్లాడిన లక్ష్మీ పార్వతి.. ఎన్టీ రామారావు గారికి హరికృష్ణ అంటే ప్రత్యేకమైన అభిమానం – ప్రేమ ఉండేది. ఆయన సీఎంగా బీజీగా ఉన్న సమయంలో – రాజకీయాలతో బిజీగా ఉన్న సమయంలో ఇంటికి పెద్దగా హరికృష్ణ వ్యవహరించేవారు. ఎన్టీఆర్ తో పెళ్లి విషయంలో తనతో తొలుత విభేదించినప్పటికీ, ఆ తర్వాత చాలా బాగా కలసిపోయాడని చెప్పారు.తనను నోరారా అమ్మా అని పిలిచేవాడని తెలిపారు. దివంగత ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని సంతకాల సేకరణ చేపట్టినప్పుడు, సంతకాల సేకరణ కోసం హరికృష్ణని కలిశానని… సంతకం చేశాడని తెలిపారు. హరికి డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టమని, డ్రైవింగ్ లో సుదీర్ఘ అనుభవం ఉందని, కానీ మృత్యువు ఎలా వెంటాడిందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండాల్సిందని అన్నారు.