తిరిగి ప్రారంభమైన కొచ్చి విమానాశ్రయం

వాస్తవం ప్రతినిధి: కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం ఈరోజు మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఇటీవల ఆ రాష్ట్రంలో సంభవించిన భారీ వరదల కారణంగా గత 15 రోజులుగా కొచ్చి విమానాశ్రయాన్ని మూసి వేసిన సంగతి తెలిసిందే.  దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో ఏడో స్థానంలో ఉన్న కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ఆగస్టు 14వ తేదీ నుంచి విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపేశారు. పదిహేను రోజుల అనంతరం ఈరోజు మధ్యాహ్నం మొదటి విమానం కొచ్చి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. అహ్మదాబాద్‌ నుంచి వచ్చిన ఇండిగో 667 విమానం మధ్యాహ్నం రెండు గంటలకు కొచ్చికి వచ్చింది. ఆగస్టు 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కేరళ భారీ వరదలతో అతలాకుతలమైన సంగతి తెలిసిందే. అయితే వరద తగ్గుముఖం పట్టకపోవడంతో దాన్ని ఆగస్టు 26, తర్వాత 29వ తేదీ వరకు పొడిగించారు. కొచ్చికి వెళ్లాల్సిన విమానాలను తిరువనంతపురం, కోజికోడ్‌, తమిళనాడులోని కోయంబత్తూర్‌, కర్ణాటకలోని మంగుళూరు విమానాశ్రయాలకు మళ్లించారు. వరదల కారణంగా పదిహేను రోజుల పాటు విమానాశ్రయం మూసేయడంతో కొచ్చి విమానాశ్రయానికి దాదాపు రూ.220కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం.