పోషియాన్ జిల్లా లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

వాస్తవం ప్రతినిధి: జమ్మూ కాశ్మీర్ లోని పోషియాన్ జిల్లా లో బుధవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీస్ వాహనాన్ని బాగు చేసుకునేందుకు వెళ్ళిన పోలీసుల పై విచక్షణారహితంగా ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీనితో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. షోపియాన్‌లోని అర్హామా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది, చనిపోయిన పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాలను ఉగ్రవాదులు అపహరించుకుపోయారని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఏడాది కాశ్మీర్‌ లోయలో పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటి వరకు 30 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అనంత్‌నాగ్‌ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే పోలీసులపై దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ అల్తఫ్‌ అహ్మద్‌ దార్‌ హతమయ్యాడు. ఈ దాడికి ప్రతీకారంగానే పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఉంటారని భద్రతా సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.