నీళ్ల సీసా కోసం వెనక్కి తిరిగారు….ఇంతలోనే!

వాస్తవం ప్రతినిధి: రెప్ప పాటు కాలంలో జరిగిన ప్రమాదం లో మాజీ ఎంపీ,సినీ నటుడు నందమూరి హరి కృష్ణ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. నీళ్ల సీసా తీసుకుందామని వెనక్కి తిరిగి చూసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాహనం అదుపు తప్పి డివైడర్ మీదుగా ఎగిరిపడి పల్టీ కొట్టడంతో తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద పోలీసు బెటాలియన్‌కు అత్యంత సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా.. నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద హరికృష్ణ వాహనం బోల్తా పడింది. పోలీసు పన్నెండో బెటాలియన్‌కు 250 మీటర్ల దూరంలోనే ఘటన చోటుచేసుకుంది. హరికృష్ణ ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనంలో ఆయనతోపాటు విజయవాడకు చెందిన వ్యాపారి రావి వెంకట్రావుతోపాటు శివాజీ అనే మరో వ్యక్తి ఉన్నారు. అతివేగం సీటు బెల్టు పెట్టుకోకపోవడమే ప్రమాదానికి కారణమని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ వెల్లడించారు. సీటు బెల్టు పెట్టుకుంటే ప్రమాద తీవ్రత తగ్గేదని, వాటర్‌ బాటిల్‌ కోసం వెనక్కి తిరగడంతో వాహనం అదుపు తప్పిందని వివరించారు. ప్రమాద సమయంలో కారు 160 కిలోమీటర్ల వేగంతో వెళుతోందని ఎస్పీ తెలిపారు. ‘‘రహదారి నిర్మాణంలో చిన్న లోపం కూడా ఉంది, దీనికి తోడు హైస్పీడులో వెళుతున్నారు. ముందు ఒక స్లైడ్‌ టర్న్‌ ఉంది. దాన్ని గమనించలేదు. ఆ టర్న్‌ దగ్గరకు వస్తున్న క్రమంలో వాటర్‌ బాటిల్‌ కోసం హరికృష్ణ వెనక్కి తిరిగారు. ముందున్న మలుపును గమనించిన వెంటనే కారును కుడివైపు కట్‌ చేశారు. ఈ క్రమంలో కారు డివైడర్‌ను కొట్టుకుంది. ప్రమాద సమయంలో కారు అతివేగంగా ఉండటంతో దాదాపు 20 అడుగులు పైకి ఎగిరి.. 20 మీటర్లు ముందుకు దూసుకెళ్లి గుంటూరు నుంచి వస్తున్న కారును ఢీకొంది. డ్రైవింగ్‌ సీటులో ఉన్న హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోలేదు. దీంతో కారులోంచి విసిరేసినట్లు 25 నుంచి 30 మీటర్ల దూరంలో పడిపోయారు. సీటు బెల్టు పెట్టుకుని ఉంటే కారులోంచి బయటపడి ఉండేవారు కాదు. సీటు బెల్టు ఉంటే ప్రమాదం జరిగినప్పుడు కారులోనే ఉండేవారు, ఎయిర్‌ బ్యాగ్స్‌ కూడా తెరుచుకునేవి. ప్రాణాలతో బయటపడటానికి ఆస్కారం ఉండేది’’ అని ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు.