పాక్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ లాంచనంగా ప్రారంభమైంది

వాస్తవం ప్రతినిధి: పాకిస్తాన్‌లో త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సోమవారం నాడు ఇక్కడ లాంఛనంగా ప్రారంభమైంది. సోమవారం నాడు ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు మమ్మూన్‌ హుస్సేన్‌ ఐదేళ్ల పదవీ కాలం ముగుస్తుండటంతో, ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సెప్టెంబర్‌ 4న పోలింగ్‌ జరుగుతుంది. సోమవారం నాడు నామినేషన్‌లు దాఖలు చేసిన వారిలో పాలక పిటిఐ నేత ఆరిఫ్‌ అల్వి, మతవాద పార్టీల కూటమి ముత్తహిదా మజ్లిస్‌-ఎ-అమల్‌ (ఎంఎంఎ) తరపున ఫజలుర్‌ రెహ్మాన్‌, పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ నేత అయితాజ్‌ హసన్‌లు వున్నారు. ప్రధాన ప్రతిపక్షం పిఎంఎల్‌-ఎన్‌, ఇతర పార్టీలు ఫజలుర్‌ రెహ్మాన్‌కు మద్దతునిస్తున్నట్లు ప్రకటించాయి. తొలుత ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించుకున్నప్పటికీ, అభ్యర్థి ఎంపికలో విభేదాలు తలెత్తటంతో ఆ యోచనను విరమించుకున్న సంగతి తెలిసిందే.