బంగ్లా లో మహిళా జర్నలిస్ట్ దారుణ హత్య

వాస్తవం ప్రతినిధి: బంగ్లాదేశ్‌లో ఒక మహిళా జర్నలిస్ట్ దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తుంది. బంగ్లా లోని ఒక టివి చానల్‌లో పనిచేస్తున్న సుబర్న నోడి అనే మహిళా పాత్రికేయురాలు ఆమె ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ను పదునైన ఆయుధంతో హత్య చేశారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆమె డైలీ జగ్రతో బంగ్లా వార్తాపత్రికతో పాటు, ఆనంద టివిలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. సుబర్న పాబ్నా జిల్లాలోని రాధానగర్‌లో జీవిస్తున్నారు. భర్తతో విబేధాలు కారణంగా విడిపోయిన ఆమె తన కుమార్తెతో కలిసి ఉంటున్నారు. 10 నుండి 12 మంది హంతకులు రాత్రి 10.45గంటలకు మోటారు వాహనాలపై వచ్చి ఆమె ఇంటి బెల్‌ను మోగించారని, అనంతరం తలుపు తీయగా వారంతా విచక్షణా రహితంగా ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ నేపధ్యంలో కేసు నమోదు చేసుకున్న అధికారులు కేసు విచారణ చేపడుతున్నామని, బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆమె హత్యను పాబ్నాలోని పాత్రికేయులు ఖండించారు. వెంటనే న్యాయం జరగాలని వాళ్లు డిమాండ్‌ చేశారు.